: ముంబయిలో కూలిన మూడంతస్తుల భవనం: ముగ్గురి మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మూడంతస్తుల భవనం కూలింది. నగరంలోని కామాటిపురాలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. కామాటిపురాలోని 14వ లైన్ లో ఉన్న ఈ భవనం ఈరోజు మధ్యాహ్నం కుప్పకూలింది. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. భవన శిథిలాల కింద నుంచి పదిమందిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని జేజే హాస్పిటల్, నాయర్ ఆసుపత్రికి తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.