: విటమిన్ ‘డి’ మోతాదు మించడంతో బాలుడి మృతి!
సూర్యరశ్మి ద్వారా సహజ సిద్ధంగా లభించే విటమిన్ 'డి'. మనిషి ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించే కాల్షియంకి, దీనికీ అవినాభావ సంబంధం వుంది. అయితే, విటమిన్-డి లోపిస్తే ఎన్నో సమస్యలొస్తాయి, అలాగే ఎక్కువైతే ప్రాణం కూడా పోతుంది. ఇందుకు ఇటీవల ఢిల్లీ శివారల్లోని జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. బాలుడిలో ఎదుగుదల లేకపోవడంతో విటమిన్-డి ఇవ్వాలని గ్రామీణ వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆ బాలుడికి 21 రోజుల్లో 6 లక్షల ఇంటర్నల్ యూనిట్ల (IU) విటమిన్-డి ఇంజెక్షన్లను ఇచ్చారు. ఇవ్వాల్సిన మోతాదు కంటే ఇది 30 రెట్లు ఎక్కువ కావడంతో ఫలితాలు వికటించాయి. విపరీతమైన కడుపునొప్పి, వాంతులు మొదలవడంతో ఆ బాలుడిని ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్)కు తరలించారు. ఆ బాలుడి ప్రాణాలు కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతన్ని కాపాడలేకపోయారు. విటమిన్-డి ఇంజెక్షన్లను మోతాదుకు మించి ఇచ్చారని, శరీరంలో కాల్షియం స్థాయి ఎక్కువ కావడంతో ఇన్ఫెక్షన్ వ్యాపించి బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.