: ‘హోదా’పై బీజేపీకి చిత్తశుద్ధి లేదు... టీడీపీకి ఆలోచన లేదు: ధ్వజమెత్తిన బొత్స సత్తిబాబు
వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ... ఏపీలో అధికార పార్టీ టీడీపీ, దాని మిత్రపక్షం బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ కేంద్రంగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి చేసిన ప్రకటనపై ఆయన నిప్పులు చెరిగారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని ఆయన ఆరోపించారు. ఇక న్యాయమైన హక్కును సాధించుకునే దిశగా అడుగులు వేయాల్సిన టీడీపీ ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేకుండాపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని బొత్స వ్యాఖ్యానించారు.