: నేటి మ్యాచ్‌తో సన్‌రైజర్స్ టీమ్ మళ్లీ పుంజుకుంటుందా..? నేడు కోహ్లీ సేనతో డేవిడ్ వార్నర్ టీమ్ ఢీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరసగా రెండు ఓటములు, మూడు విజయాలను రుచి చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. అనంతరం కొత్త జట్టు పుణెతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలయింది. ఈరోజు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలబడనుంది. నేటి మ్యాచ్ లో విజయం సాధించి ఐపీఎల్-9లో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. తమ జట్టు నేటి మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుందని, రాయల్స్ చాలెంజర్స్తో ఇంతకుముందు జరిగిన మ్యాచుల్లో తమ జట్టు పరాజయం పొందడానికి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ల విజృంభణే కారణమని సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. అయితే ఈ సారి ప్రణాళికలు రచించుకొని క్రికెట్ పోరాటానికి సిద్ధమయ్యామని ఆయన చెప్పాడు. తమ జట్టు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని హైదరాబాద్ జట్టు పట్టుదలగా ఉంటే, మరోవైపు టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జట్టు పట్టు సడలినట్లు కనబడుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడింటిలో ఓడి నాలుగు పాయింట్లు మాత్రమే సాధించింది. అయితే, గెలుపుకోసం ఎదురు చూస్తూ కసిగా ఉన్న బెంగళూరు ఆటగాళ్లు ఈరోజు మైదానంలో విధ్వంసకర ఆటతీరునే ప్రదర్శిస్తారని విశ్లేషకులు అంటున్నారు.