: జగన్ స్క్రీన్ పై ‘నలుగురు’ చంద్రబాబులు!...‘హోదా’పై చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టిన జగన్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మీడియా సమావేశాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని నిన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి చేసిన ప్రకటనపై నిరసన తెలిపేందుకు కొద్దిసేపటి క్రితం జగన్... లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనే కాకుండా... కేంద్రాన్ని నిలదీయలేని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి తీరుపైనా నిప్పులు చెరిగేందుకు సర్వం సిద్ధం చేసుకుని వచ్చిన ఆయన ఓ ప్రత్యేక ఏర్పాటును అక్కడ ప్రదర్శించారు. ఆర్థిక లోటులో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉందని పలు సందర్భాల్లో చంద్రబాబు తన గళం వినిపించారు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోలన్నింటినీ ఓ దగ్గరికి చేర్చిన జగన్... వాటిని ఓ ప్రత్యేక వీడియోగా తయారు చేయించారు. ఒకే స్క్రీన్ పై నలుగురు చంద్రబాబులు కనిపించేలా ఏర్పాటు చేయించిన జగన్... ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటనలను వరుసపెట్టి వినిపించారు. ఈ ప్రత్యేక ఏర్పాటు అటు మీడియా ప్రతినిధులనే కాక... సదరు మీడియా సమావేశాన్ని ప్రత్యక్షంగా చూసిన జనాన్ని బాగానే ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News