: ప్రాజెక్టులకు గ్రాంట్లు లేవ్!... ఇకపై అంతా రుణమే!: తెలుగు రాష్ట్రాలకు షాకిస్తున్న కేంద్రం


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలకు కేంద్రం షాకుల మీద షాకులిస్తోంది. రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఆర్థిక లోటులో చిక్కుకున్న నవ్యాంధ్రకు చిల్లిగవ్వ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేని కేంద్రం... తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులనూ ప్రశ్నార్థకం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. వివరాల్లోకెళితే... సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేస్తోంది. గ్రాంట్ అంటే సాయమే కాని, రుణం కాదు. అయితే ఇకపై సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే నిధులను గ్రాంట్ గా కాకుండా రుణంగా అందజేయాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్రాలకు విడుదల చేసే గ్రాంట్ల కోసం కేంద్రం.... జైకా, నాబార్డ్ తదితర సంస్థల నుంచి అప్పులు తీసుకుంటోంది. తాను అప్పుగా తీసుకున్న నిధులను రాష్ట్రాలకు గ్రాంట్ గా ఇవ్వాల్సిన అవసరమేముందన్న భావనతో మోదీ సర్కారు కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే... మిగతా రాష్ట్రాల పరిస్ధితి ఎలా ఉన్నా... తెలుగు రాష్ట్రాలు మాత్రం తీవ్రంగా నష్టపోనున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అందే వెసులుబాటు రెండు రాష్ట్రాలకు మృగ్యం కానుంది. కేంద్రం ఇచ్చే నిధులను గ్రాంటుగా అయితే తీసుకోవడానికి సరేనంటున్న రాష్ట్రాలు అప్పుగా తీసుకోవాలంటే కాస్తంత ఆలోచించాల్సిందే. ఇదిలా ఉంటే... జాతీయ హోదా దక్కిన ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరితో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాలకు ఇచ్చే అప్పులో సగం తాను, మిగిలిన సగం రాష్ట్రం భరించేలా కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇదే జరిగితే... ఏపీలో కీలక ప్రాజెక్టుగా పరిగణిస్తున్న పోలవరం నిర్మాణంపై పెను ప్రభావం పడనుంది. మరి కేంద్రం యోచనను రాష్ట్రాలు ఏ మేరకు అడ్డుకుంటాయో చూడాల్సిందే.

  • Loading...

More Telugu News