: పగలు సమీక్ష!... రాత్రి ప్రాజెక్టు నిద్ర!: హరీశ్ రావు కొత్త మంత్రం
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళిక రచించుకున్న ఆయన నిన్న దానిని అమల్లోకి పెట్టేశారు. వివరాల్లోకెళితే... గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం అధికారులు ‘పల్లె నిద్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరహాలోనే హరీశ్ రావు ‘ప్రాజెక్టు నిద్ర’ కార్యక్రమానికి తెర తీశారు. నిన్న పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన హరీశ్ రావు... జిల్లాలో కొనసాగుతున్న పలు సాగు నీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. ఆ ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్ష సాయంత్రం ముగిసింది. ఆ తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల-2 పథకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత రాత్రి అక్కడే ఆయన నిద్రపోయారు.