: కర్నూలులో విషాదం... పెళ్లైన రెండు నెలలకే టీచర్ సూసైడ్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. అక్కడి కిందిమాలగేరి గ్రామంలో పెళ్లైన రెండు నెలలకే ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పుట్టుకతోనూ అంగవైకల్యం ఉన్న మీనాక్షి కష్టపడి చదివి, టీచర్ జాబ్ సంపాదించుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గొల్ల రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరూ కొన్ని రోజులు సహజీవనం చేశారు. అనంతరం రాజు పెళ్లికి నిరాకరించడంతో మీనాక్షి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల జోక్యంతో వీరిరువురికీ పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత వరకట్నం తీసుకురావాలంటూ రాజుతో పాటు అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేయడంతో మీనాక్షి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మీనాక్షి రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా అత్తింట్లో మీనాక్షి ఎదుర్కొన్న వేధింపులు బయటపడ్డాయి. మీనాక్షి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రాజు కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.