: సంచలన బొగ్గు కుంభకోణం వ్యవహారంలో దాసరిపై మరింత బిగిసిన ఉచ్చు.. చార్జ్‌షీట్ నమోదు చేయాలని ఆదేశాలు
కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు కుంభకోణంలో అంటిన మరక వదలడం లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌గేట్ వ్యవహారంలో దాసరిపై ఉచ్చు మరింత బిగుస్తోంది. బొగ్గు కుంభ కోణంపై ఈరోజు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తగిన ఆధారాలు ఉన్నాయంటూ తమ వాదనలను ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో దాసరి నారాయణరావుపై చార్జ్‌షీట్ నమోదు చేయాలని విచారణ అనంతరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాసరితో పాటు నవీల్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాపై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అక్రమ మార్గాల్లో బొగ్గు కేటాయింపులు జరిపారంటూ ఆధారాలు ఉన్నాయంటూ న్యాయవాదులు కోర్టుకు విన్నవించినట్లు తెలుస్తోంది. దీంతో వీరు ముగ్గురి పరస్పర సహకారంతోనే కుంభకోణానికి పాల్పడ్డట్టు కోర్టు అభిప్రాయపడింది. చార్జ్‌షీట్ నమోదు చేస్తే వీరిపై కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది.