: కలిసిపోయిన భూమా, శిల్పా!... బుడ్డా చేరిక సందర్భంగా రాజీపడ్డ ప్రత్యర్థులు


కర్నూలు జిల్లా టీడీపీలో కుమ్ములాటలకు తెర పడిపోయింది. మొన్నటిదాకా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడమే కాక పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి... పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి నిన్న విజయవాడలో కలిసిపోయారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు తన అనుచరవర్గంతో నిన్న విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా బుడ్డా నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. బుడ్డాతో పాటు భూమా, శిల్పాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భూమా, శిల్పాల మధ్య మాట కలిసింది. జిల్లాలో పార్టీ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. బుడ్డా కూడా వారితో కలిసి పలు అంశాలను చర్చించారు. నిన్నటిదాకా భిన్న ధ్రువాలుగా ఉన్న నేతలు కలిసి మాట్లాడుకోవడం అక్కడికి వచ్చిన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. జిల్లాకు చెందిన మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో భూమా, శిల్పాల మధ్య రాజీ కుదరడం టీడీపీకి కలిసివచ్చే అంశంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News