: 21 బంతుల్లోనే శతకం!... గేల్ రికార్డును బద్దలు కొట్టిన ట్రినిడాడ్ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అతడి రికార్డు మూడంటే మూడేళ్లలోనే బద్దలైపోయింది. 2013లో గేల్ రికార్డు ఇన్నింగ్స్ నమోదు చేయగా, తాజాగా నిన్న దానిని ట్రినిడాడ్ అండ్ టొబాగో యువ సంచలనం ఇరాఖ్ థామస్ బద్దలుకొట్టాడు. కేవలం 21 బంతుల్లో సెంచరీ చేసిన థామస్... పొట్టి ఫార్మాట్ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. టొబాగో క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీలో స్కార్ బారో తరఫున బరిలోకి దిగిన అతడు స్పీ సైడ్ జట్టుపై ఈ ఘనత సాధించాడు. 23 ఏళ్ల వయసున్న థామస్... తన ఇన్నింగ్స్ లో మొత్తం 31 బంతులను ఎదుర్కొని 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే చితకబాదిన థామస్... 15 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు.