: మే 15 నాటికి వైసీపీని వీడనున్న 30 మంది ఎమ్మెల్యేలు: జలీల్ ఖాన్ జోస్యం
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నిన్నటికి 16కు చేరింది. త్వరలో మరో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గడచిన ఎన్నికల్లో జలీల్ ఖాన్ కూడా వైసీపీ టికెట్ పైనే బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారి సంఖ్య ఇప్పటికే 16కు చేరింది. మరో 14 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. మే 15లోగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య 30కి చేరుకుంటుంది’’ అని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.