: అవినీతికి తోడు నిరంకుశత్వానికి కేరాఫ్ అడ్రెస్ వైఎస్ జగన్: జలీల్ ఖాన్ సంచలన ఆరోపణ
వైసీపీ టికెట్ పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జలీల్ ఖాన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జలీల్ ఖాన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఖరిని భరించలేకే తాను పార్టీ మారానని ఆయన చెప్పారు. సొంత బంధువులు కూడా జగన్ ను భరించలేకపోతున్నారని, ఈ కారణంగానే గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు పార్టీ మారుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పోల్చుతూ జలీల్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘వైఎస్ ఎంత అవినీతి చేసినా, పార్టీ నేతలను నవ్వుతూ పలకరించేవారు. జగన్ లో అవినీతికి తోడు నిరంకుశత్వమూ ఉంది. ఎవరినీ అడగడం గాని, ఎవరైనా చెప్పేది వినే అలవాటు గాని ఆయనకు లేవు. అసెంబ్లీలో ఆయన చేయి ఊపితే... పోడియం వద్దకు పోవడం మినహా మాకు వేరే పని ఉండేది కాదు. జగన్ ను కలవాలంటే... మేడపై నుంచి ఆయన కిందకు కూడా రారు. మూడు రోజుల ముందుగా ఆయన పీఏను అడగాలి. ఆయన పడుకున్నప్పుడు లేచే దాకా వెయిట్ చేయాలి. ఈ క్రమంలో మనల్ని ఎవరైనా హత్య చేసినా పట్టించుకునే దిక్కుండదు’’ అని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.