: ప్రముఖ మలయాళ కార్టూనిస్ట్ వీటీ థామస్ అలియాస్ టామ్ మృతి
ప్రముఖ మలయాళ కార్టూనిస్ట్ వీటీ థామస్ (87) అలియాస్ టామ్ మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. కాగా, ప్రముఖ కామిక్ సిరీస్ 'బోబన్ అండ్ మోలీ' సృష్టికర్త ఆయనే. 1961లో 'మలయాళ మనోరమ' వార పత్రికలో కార్టూనిస్ట్ గా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. విశేషం ఏమిటంటే, ఏ పత్రికలోనైతే తన కెరీర్ ను ప్రారంభించారో అదే పత్రికలో 1987లో రిటైర్ అయ్యారు. 'బోబన్ అండ్ మోలీ' కార్టూన్ కామిక్ సిరీస్ తో పాఠకులను ఆయన ఆకట్టుకున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత తన కార్టూన్లకు సంబంధించిన కాపీ రైట్ విషయంలో మలయాళ మనోరమ యాజమాన్యం, థామస్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ కేసును మలయాళ మనోరమ యాజమాన్యం గెలిచినప్పటికి కాపీ రైట్లను థామస్ కే ఇచ్చివేసింది. ఆ తర్వాత థామస్ తన కార్టూన్ క్యారక్టర్లతో బోబన్ అండ్ మోలీయమ్ అనే సొంత మ్యాగజైన్ ప్రారంభించారు.