: డబ్బును పొదుపు చేసినట్లే నీటిని కూడా చేయాలి: సినీ నటుడు రాజేంద్రప్రసాద్
‘సేవ్ వాటర్‘ నినాదంతో ముందుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ విజయవాడలోని ఒక ఇంకుడుగుంతను తవ్వారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అయ్యప్పనగర్ వాటర్ ప్లాంట్ ఏరియాలో ఈ గుంత నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ,‘మనిషి హాయిగా బతకాలంటే ముఖ్యంగా కావాల్సింది గాలి, నీరు. డబ్బును ఎలాగైతే మన అవసరానికి కావాల్సింది వాడుకుని మిగిలింది దాచుకుంటున్నామో, అలాగే, నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వర్షపునీరు, నదుల నీరు ఏదైనా సరే, సముద్రంలో కలిసిపోకుండా చూడాలి. వర్షం కురిసిన తర్వాత చాలా వర్షపు నీరు వృథా అయిపోతోంది. అలా కాకుండా చూడాలి. ఒక బిందెతో, గుండిగతో, మహా అయితే ఒక వాటర్ ట్యాంకులో నీటిని దాచుకోగల్గుతాం. అంతకన్నా ఎక్కువగా ఉన్న నీటిని ఎక్కడ దాయగల్గుతాం? అదే కనుక, నీటిని భూమిలోకి పంపితే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మన కోసం కాకపోయినా, మన స్వార్థం కోసం కాకపోయినా... రాబోయే తరాల కోసం నీటిని సేవ్ చేయాలి. అందుకోసమే, ఇంకుడుగుంతలు తవ్వడం’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.