: హజీ అలీ దర్గాలోకి ప్రవేశించడానికి సల్మాన్, షారుక్‌ల సాయం కావాలి: తృప్తీ దేశాయ్
దేశవ్యాప్తంగా దేవాలయాల్లో మహిళల ప్రవేశాన్ని డిమాండ్ చేస్తూ భూమాతా బ్రిగేడ్ సంస్థ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ మహిళలతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ హజీ అలీ దర్గాలోనికి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కొన్ని రోజుల క్రితం శివసేన నాయకుడు హజీ అరాఫత్ షేక్ హెచ్చరికలు చేశారు. తృప్తీ దేశాయ్ ఆ దర్గాలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే చెప్పులతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆమె బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌ల సాయం కోరారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా తాము చేస్తోన్న ఉద్యమానికి వీరిరువురూ మద్దతు తెలిపాలని కోరారు. సల్మాన్, షారుక్ తమకు మద్దతు తెలిపితే వారి అభిమానులు హజీ అలీ దర్గాలోనికి ప్రవేశించే క్రమంలో తమ ఉద్యమంలో కలుస్తారని పేర్కొన్నారు.