: 'పీఎస్‌ఎల్వీ సీ-33' ప్రయోగం విజయవంతం పట్ల మోదీ హర్షం.. సార్క్ దేశాలకు సైతం సేవలందించవచ్చని వ్యాఖ్య
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి భారత శాస్త్రవేత్తలు ప్రయోగించిన 'పీఎస్‌ఎల్వీ సీ-33' విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం అయిన వెంటనే మోదీ మాట్లాడుతూ.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఆఖరిది, ఏడవదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సొంత నావిగేషన్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. జీపీఎస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని, 1500 చ.కి.మీ పరిధిలో నావిగేషన్ వ్యవస్థ సేవలు అందించనుందని తెలిపారు. మన దేశానికే కాకుండా ఈ ఉపగ్రహం ద్వారా సార్క్ దేశాలకు కూడా సేవలందించవచ్చని తెలిపారు. సామాన్యుల జీవితాలలోను, వ్యవస్థలోను మార్పుల కోసం అంతరిక్ష పరిజ్ఞానం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.