: రోజాకు కౌంటరిచ్చిన నారా లోకేశ్!... జగన్ ఆస్తులు ఎందుకు వెల్లడించడం లేదని నిలదీత
టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న విశాఖ పర్యటన సందర్భంగా అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. తాజాగా లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా హైదరాబాదులో టీడీపీపై విరుచుకుపడ్డారు. దొంగలుగా మారిన టీడీపీ నేతలతో తాము చర్చకు సిద్ధంగా లేమంటూ ఆమె స్పందించారు. రోజా మీడియా సమావేశం ముగిసిందో, లేదో... విజయవాడలో మరోమారు నారా లోకేశ్ మీడియా ముందుకు వచ్చారు. ‘మీడియాతో చిట్ చాట్’ పేరిట జరిగిన చర్చా గోష్టిలో లోకేశ్... జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నానని ఆయన ప్రకటించారు. చర్చకూ తాను సిద్ధమేనని కూడా లోకేశ్ పేర్కొన్నారు. అయినా దేశంలో ఎవరి అక్రమాస్తులు వెలుగులోకి వచ్చినా, వాటిలో తమకు భాగముందంటూ ఆరోపించడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. రూ.350 కోట్ల విలువ ఉన్న ఫైబర్ గ్రిడ్ లో రూ.1,400 కోట్ల మేర అవినీతి ఎలా జరిగిందో వైసీపీ నేతలే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా తమ కుటుంబం ఆస్తుల వివరాలను వెల్లడిస్తోందని, ఏనాడైనా జగన్ తమలా ఆస్తులు వెల్లడించారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆస్తుల వెల్లడికి జగన్ సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.