: ప్రజల కోసం నేను అన్నీ వదులుకున్నాను: చంద్రబాబు
‘ప్రజల కోసం అన్నీ వదులుకున్నా’నని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అమరావతి సమీపంలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజా సంక్షేమం కోసం తాను అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, వారి మాటల్లో నిజంలేదన్నారు. శ్రీశైలాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాయలసీమలో కరవు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ నీటి కష్టాలు తీరుస్తామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకుండా తమపై విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు.