: ఎన్నికల్లో తనను మట్టి కరిపించిన బుడ్డాను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించిన శిల్పా!
కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కొద్దిసేపటి క్రితం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా వైసీపీ కన్వీనర్ గా ఉన్న బుడ్డాను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందులో ఆసక్తికర అంశమేముందనేగా? ఎందుకు లేదూ! గడచిన ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, శిల్పా... ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ శిల్పా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్షేమ, సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆర్థికంగా బలీయంగా ఉన్న శిల్పా చేతిలో... ఆర్థికంగా బాగా చితికిపోయిన బుడ్డా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆ ఎన్నికల ఫలితాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ... శిల్పాపై బుడ్డా జయకేతనం ఎగురవేశారు. స్వల్ప మెజారిటీతోనే అయినా... బుడ్డా విజయ ఢంకా మోగించారు. తదనంతర పరిణామాల్లో శిల్పా... పెద్దల సభగా పేరుపడ్డ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తాజాగా విజయవాడ వేదికగా జరుగుతున్న బుడ్డా చేరిక సభలో... బుడ్డా చేతిలో ఘోరంగా ఓటమిపాలైన శిల్పా చక్రపాణిరెడ్డి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.