: ఇద్దరు ‘చంద్రులు’ చేతులు కలిపితేనే అభివృద్ధి సాధ్యం!: కొణిజేటి రోశయ్య కామెంట్
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేలలో అభివృద్ధికి బాటలు పడాలంటే ఇద్దరు ‘చంద్రులు’ చేతులు కలపాల్సిందేనని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా కొనసాగుతున్న రోశయ్య... నిన్న గుంటూరు జిల్లాలోని తన సొంతూరు వేమూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి పట్టాలెక్కాలంటే... ఇరు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని రోశయ్య అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీ త్వరగా కోలుకోవాలంటే... కేంద్రం ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. ప్రజలపై ఏమాత్రం భారం పడకుండా ఉండేలా కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడు గవర్నర్ హోదాలో ఉన్న తాను... నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం భావ్యం కాదని కూడా రోశయ్య పేర్కొన్నారు.