: నారా లోకేశ్ కోసం రాజీనామా చేస్తాం!... పోటాపోటీ ప్రకటనలు చేసిన అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే!


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. ‘ఇప్పుడు కాదు... తరువాత ఎప్పుడైనా చూద్దాం’ అంటూ సాక్షాత్తు పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించినా... ఆ పార్టీ నేతల్లో ఈ దిశగా ఆశలు మాత్రం సన్నగిల్లడం లేదు. రాష్ట్ర కేబినెట్ లోకి లోకేశ్ ను తీసుకోవాలని కొందరు కోరితే... ఏకంగా కేంద్ర కేబినెట్ లో లోకేశ్ మరింత మెరుగ్గా రాణిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో, లేదంటే అటు కేంద్రంలో... ఎక్కడ లోకేశ్ కు చోటు కల్పించినా ఆయన కోసం తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి యువ నేతను బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామన్న ప్రకటనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న లోకేశ్ విశాఖ వెళ్లిన సమయంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ పోటాపోటీ ప్రకటనలు చేశారు. కేంద్ర కేబినెట్ లో లోకేశ్ కు స్థానం కల్పిస్తే... తన పదవికి రాజీనామా చేసి ఆ సీట్లో నుంచి లోకేశ్ ను ఎంపీగా గెలిపించుకుంటానని తొలుత ముత్తంశెట్టి ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడిన పీలా గోవింద్ కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. రాష్ట్ర కేబినెట్ లోకి లోకేశ్ ను తీసుకుంటే... యువనేత కోసం తన పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాక లక్ష మెజారిటీతో లోకేశ్ ను గెలిపించుకుంటామని కూడా పీలా అన్నారు. లోకేశ్ కోసం నేతలు పోటా పోటీ ప్రకటనలు చేసిన వైనాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News