: పార్టీనీ వదిలే వాళ్లు వెళ్లిపోవచ్చు, కానీ, జగన్ పై దుష్ర్పచారం చేయడం దురదృష్టం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


వైఎస్సార్సీపీని వదిలి వెళ్లే వాళ్లు వెళ్లవచ్చు, కానీ, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో ఒక ఛానెల్ తో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి, జగన్ పై కామెంట్లు చేయడం పద్ధతి కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగానైతే జగన్ పై ప్రచారం చేస్తున్నారో అదే విధంగా, తెలుగుదేశం పార్టీ అభిమతాన్ని మైసూరా రెడ్డి తన లేఖలో వ్యక్తం చేశారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మైసూరారెడ్డి చెప్పినట్లుగా జగన్ విలువలు లేని వ్యక్తే కనుక అయితే తాము ఈ పార్టీలో కొనసాగేవాళ్లం కాదన్నారు. జగన్ తమను అన్ని విధాలా గౌరవిస్తున్నారని, తమ మాటకు విలువిస్తున్నారని అన్నారు. అందువల్లనే తామందరము కూడా జగన్ కు అండగా ఉంటామని, జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా టీడీపీపై తాము పోరాడతామని చెప్పారు. తమ ఢిల్లీ పర్యటన బాగా సాగిందని, తాము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఇక్కడి నాయకులు స్పందించారని, చంద్రబాబు అవినీతి గురించిన పుస్తకాన్ని వారికిచ్చామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News