: అమరావతి పోలీస్ కమిషనర్ గా లక్ష్మీనారాయణ!... అదేమీ లేదన్న సీబీఐ మాజీ జేడీ
మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పలు సంచలన కేసులను ఛేదించిన లక్ష్మీనారాయణ... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి పోలీస్ కమిషనర్ గా రానున్నారా? అంటే... అవుననే అంటున్నాయి తెలుగు నేలకు చెందిన పలు మీడియా సంస్థలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన లక్ష్మీనారాయణ... కేసులో పలు కీలక ఆధారాలను సేకరించి జగన్ ను ఏకంగా అరెస్ట్ చేశారు. ఇక ఓబుళాపురం అక్రమ గనులకు సంబంధించిన కేసును కూడా లక్ష్మీనారాయణే చేపట్టారు. ఈ కేసులోనూ ఆయన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ రెండు కేసుల దర్యాప్తులో మెరుగైన పనితీరు కనబరచిన లక్ష్మీనారాయణ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ తన సొంత కేడర్ అయిన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ అదికారంలోకి రావడం, నవ్యాంధ్ర నూతన రాజధాని కేంద్రంగా కొత్త కమిషనరేట్ ను ప్రారంభిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉన్న పళంగా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మీనారాయణ అమరావతి కమిషనర్ గా వస్తున్నారని ఎవరు ప్రచారం మొదలెట్టారో తెలియదు కాని, ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ప్రచారాన్ని లక్ష్మీనారాయణ స్వయంగా కొట్టిపారేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్ తో కొద్దిసేపటి క్రితం ఫోన్ లో మాట్లాడిన ఆయన... తాను అమరావతి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆ ప్రచారమంతా తప్పుడు ప్రచారమేనని ఆయన తేల్చేశారు. ఈ విషయంలో తానేమీ ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్న ఆయన... ఒకవేళ ఆ ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినా అంగీకరించబోనని చెప్పారు. దీనికి ఆయన కారణం కూడా చెప్పారు. ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్న తాను అంతకంటే తక్కువ స్థాయి ర్యాంకు ఉన్న అధికారి చేపట్టాల్సిన అమరావతి పోలీస్ కమిషనర్ పదవిని చేపట్టబోనని లక్ష్మీనారాయణ తెలిపారు.