: మే నెలాఖరు నాటికి ‘నామినేటెడ్’ భర్తీ!... పదవులు రాకున్నా నిరాశ వద్దు: కేసీఆర్


వచ్చే నెలాఖరు (మే) నాటికి రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఖమ్మంలోని చెరుకూరి తోటలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రసంగంలో కేసీఆర్... పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. వచ్చే నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించిన ఆయన... ఈ చర్యతో పార్టీకి చెందిన నాలుగు వేల మందికి అవకాశం దక్కుతుందన్నారు. ఈ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కని నేతలు ఏమాత్రం నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కాస్తంత ఓపిక పడితే అందరికీ అవకాశాలు దక్కుతాయన్నారు. ఇందుకు ఆయన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదంతాన్ని ప్రస్తావించారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ టికెట్ కోసం యత్నించిన ప్రభాకర్ రెడ్డి... తన సూచనతో తన యత్నాలను విరమించుకుని గజ్వేల్ లో తన గెలుపు కోసం శ్రమించారన్నారు. ఈ కారణంగానే ఆ తర్వాత తాను రాజీనామా చేసిన మెదక్ ఎంపీ సీటును ఆయన నిబద్ధతకు బహుమానంగా ఇచ్చానని కేసీఆర్ చెప్పారు. పార్టీ మాటకు కట్టుబడ్డ ప్రభాకర్ రెడ్డి... అడిగింది ఎమ్మెల్యే టికెట్ అయితే, దక్కింది మాత్రం ఎంపీ టికెట్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News