: 'ఆరంభింపరు నీచ మానవులు...' అనే పద్యంతో ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్
ఏం జరుగుతుందోనన్న భయంతో నీచమానవులు పనిని ప్రారంభింపబోరని, ధీరులే గొప్పపనులు ఆరంభించి ఫలితాలు రాబడుతారని ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. "ఆరంభింపరు నీచ మానవులు" అనే పద్యంతో కేసీఆర్ ప్లీనరీలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా టీఆర్ఎస్‌ని ప్రారంభించామని, అన్ని అవరోధాలను అధిరోహించి తెలంగాణను సాధించామని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారు ప్లీనరీ సభలో ఉన్నారని, రాష్ట్ర సాధన ఘనత కార్యకర్తలకు దక్కుతుందని చెప్పారు. టీఆర్ఎస్ అంటే ముందుగా గుర్తు కొచ్చేది కేసీఆర్.. తరువాత ఆ పార్టీ శ్రేణులని వార్తా పత్రికల్లో రాస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వదలని దీక్షతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాం కాబట్టే తెలంగాణ సాధించామని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల చరిత్ర... తెలంగాణ చరిత్రలో లిఖించబడి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధనలో ఉద్యమం ప్రారంభం కాగానే ఆ ఉద్యమాన్ని తీవ్రంగా విమర్శించారని, ప్రపంచ ఉద్యమాల చరిత్రకే భాష్యం చెప్పేట్లు ఉద్యమాన్ని నిలబెట్టి, తెలంగాణ సాధించామని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమం అయిపోయిందని, టీఆర్ఎస్ ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారని అన్నారు. కానీ, బంగారు తెలంగాణ నిర్మాణాన్ని మనమే తీసుకోవాలని నిర్ణయం తీసుకొని ఎన్నికల్లోకి దిగామని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.