: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం: బీజేపీ రూ.50 కోట్ల బేరంతో ప్రలోభ పెట్టిందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ తంటాలు పడుతున్నాయి. ప్రత్యర్థి నేతలపై విమర్శలు గురిపెడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.50కోట్లతో తమను కొనడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారంటూ ఆరోపించారు. తదుపరి ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామంటూ బీజేపీ నేతలు ప్రలోభ పెట్టారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్ నేతలను కొనలేరని ఉద్ఘాటించారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించింది. తగిన ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ తమపై ఆరోపణలు గుప్పిస్తోందని పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ సీఎం హరీష్ రావత్ దొరికి పోయారని విమర్శించింది.