: కర్ణాటకలో మారిన రాజకీయ సమీకరణాలు... సిద్ధరామయ్యకు పదవీ గండం!
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చకచకా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి రేపో, మాపో ఊడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన పలు పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం సిద్ధు (సిద్ధరామయ్య నిక్ నేమ్) విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సిద్ధరామయ్య ఆశ్రిత పక్షపాతంతో తన కుమారుడికి కాంట్రాక్టులు కట్టబెట్టడాన్ని కూడా అధిష్ఠానం తీవ్రంగా తీసుకుంది. దీంతో ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే, కర్ణాటక బీజేపీ విభాగం పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తిరిగి చేపట్టడం కూడా కాంగ్రెస్ లో గుబులు రేగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. సీఎం పీఠం దక్కించుకోగల అవకాశం ఉన్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.ఎం. కృష్ణతోపాటు, ప్రస్తుతం ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్.ఎం.కృష్ణ తనకున్న పలుకుబడిని పూర్తి స్థాయిలో ఉపయోగించి మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన గతవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారని సమాచారం. అంతేకాదు తనకు అవకాశం ఇస్తే రెండేళ్లలోనే పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చి, తగిన విరాళాలు కూడా అందేలా చూస్తానని ఆయన అధినేత్రికి హామీ ఇచ్చారు. ఎస్.ఎం.కృష్ణ వక్కలిగ వర్గానికి చెందిన వారు. అయితే, దళిత నేత అయిన ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వరను సీఎం చేయడం వల్ల మరింత ప్రయోజనం సిద్ధిస్తుందని అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో దళితులు చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉండడంతోపాటు పరమేశ్వర మచ్చలేని నేత కావడం ప్లస్ పాయింట్. పరమేశ్వర కూడా గతవారం సోనియాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే సీఎం పీఠానికి తగిన అభ్యర్థి అయినప్పటికీ... పార్లమెంటులో ప్రస్తుతం పార్టీకి నాయకత్వం వహించే కీలకమైన స్థానంలో ఉన్నందున ఆయన పోటీలో ఉండకపోవచ్చని పార్టీ వర్గాల అభిప్రాయం. బీజేపీ రాష్ట్ర పగ్గాలు యడ్యూరప్ప చేపట్టడం, లింగాయత్ వర్గంలో అత్యంత పలుకుబడి కలిగిన నేత అయిన యడ్యూరప్ప తనకున్న ప్రాబల్యంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను తుడిచిపెట్టడం ఖాయమన్న విశ్లేషణలూ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా అదే సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సిద్ధరామయ్యపై ఇటీవల అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. కుమారుడికి ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టెబట్టడం దగ్గర్నుంచి, పలు భూ కేటాయింపుల్లో ఆయన అవినీతికి పాల్పడినట్టు కథనాలు వెలుగు చూశాయి. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడింది. వాస్తవానికి సుదీర్ఘ కాలం తర్వాత గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించడం వెనుక సిద్ధరామయ్య కష్టం, వ్యూహాలే ప్రధాన బలంగా నిలిచాయి. ఏది ఏమైనప్పటికీ రానున్న నెల రోజులు సిద్ధరామయ్యకు గడ్డు కాలమని, మే నెల చివరి నాటికి సీఎం మార్పు ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం