: ‘ఆకర్ష్’కు కారణం చెప్పిన చంద్రబాబు!... మెత్తబడ్డ కరణం బలరాం!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. ఈ విషయంలో జగన్, ఆయన పార్టీ నేతలకే కాకుండా... కొందరు టీడీపీ నేతలకు కూడా కంటిమీద కునుకు పడటం లేదు. ఎందుకంటే, అప్పటిదాకా రాజకీయ శత్రువులుగా ఉన్న వారితో కలిసి పనిచేయడమెలాగా? అన్న ఆందోళన కొందరు టీడీపీ నేతలను కలచి వేస్తోంది. ఈ క్రమంలో తొలుత కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికపై ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ రామసుబ్బారెడ్డి నిరసన గళం విప్పారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు రామసుబ్బారెడ్డిని నేరుగా విజయవాడకు పిలిపించుకుని సర్దిచెప్పడంతో ఆయన మెత్తబడ్డారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా నేడు టీడీపీలో చేరుతున్నారు. గొట్టిపాటి చేరికను టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు, అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కరణం వెంకటేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు మునుపటి వ్యూహాన్నే అనుసరిస్తూ కరణంను విజయవాడకు పిలిపించారు. కుమారుడు, అనుచరగణంతో వచ్చిన కరణం బలరాంతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు గల కారణాలను చంద్రబాబు వివరించారు. ‘‘ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటూ విపక్షం బరి తెగిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? విపక్షం ఆ స్థాయికి వెళ్లినప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా? అందుకే ‘ఆకర్ష్’కు తెర తీశాం. సీనియర్లుగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవాల్సిందే’’ అని చంద్రబాబు చెప్పారు. దీంతో కరణం మెత్తబడక తప్పలేదు.

  • Loading...

More Telugu News