: భారతీయ నేతలతో టచ్ లోనే దావూద్!... ఇండియా టుడే ఎథికల్ హ్యాకింగ్ లో వెలుగులోకి!
ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం దేశం విడిచిపెట్టి దాదాపుగా 25 ఏళ్లు కావస్తోంది. అయినా అతడు ఇప్పటికీ భారతీయ నేతలతో టచ్ లోనే ఉంటున్నాడు. దావూద్ ఫోన్ నుంచి వెళ్లే ప్రతి పది కాల్స్ లో ఐదు కాల్స్ భారత్ లోని వ్యక్తులకే వస్తున్నాయట. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఇండియా టుడే’ కు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసిన ఎథికల్ హ్యాకింగ్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో విలాసవంతమైన భవంతిలో నివాసముంటున్న దావూద్...ఆ ఇంటిలో నాలుగు ల్యాండ్ లైన్ ఫోన్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫోన్లన్నీ అతడి భార్య మహజబీన్ షేక్ పేరిటే ఉన్నాయి. సాధారణంగా దావూద్ ఇంటిలోని ఫోన్లను ట్యాప్ చేయడం అంత సులువేమీ కాదు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రక్షణలో ఉన్న అతడి ఫోన్లకు సంబంధించి కాల్ డేటాను సేకరించడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఇండియా టుడే పత్రికకు చెందిన వడోదర విభాగంలో పనిచేస్తున్న మనీష్ భాంగలే, జయేష్ షాలు దాదాపు 8 వారాల పాటు శ్రమించి ఎథికల్ హ్యాకింగ్ పధ్ధతిలో పాకిస్థాన్ టెలికాం డేటా బేస్ లోకి ప్రవేశించి, దావూద్ కాల్ డేటాను సేకరించగలిగారు. 021358719, 021358739, 021358799, 021358799 నెంబర్లతో ఉన్న ఈ ఫోన్ల ద్వారానే దావూద్ ఫోన్లు చేస్తాడు. ఎథికల్ హ్యాకింగ్ లో భాగంగా మనీష్, జయేష్ లు... 2015 సెప్టెంబర్ 5 నుంచి 2016 ఏప్రిల్ 5 దాకా ఈ నెంబర్లకు చెందిన కాల్ డేటాను సేకరించగలిగారు. ఈ నెంబర్లలోని మొదటి నెంబర్ నుంచి వెళ్లిన ప్రతి పది ఫోన్ కాల్స్ లో ఐదు భారత్ కే వచ్చాయట. మహారాష్ట్రలోని ఓ కీలక రాజకీయ పార్టీకి చెందిన అగ్ర నేతకు దావూద్ తరచుగా ఫోన్ చేసేవాడట.