: రేపే టీడీపీలోకి బుడ్డా!... బహిరంగ ప్రకటన చేసిన వైసీపీ ఎమ్మెల్యే!
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 13 మంది ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా నేడు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరనున్నారు. ఈ క్రమంలో నిన్న కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘జంపింగ్’కు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేశారు. బుడ్డా పార్టీ మారనున్నట్లు ఇప్పటికే ఖరారైనా... ఆయన నోటి నుంచి ఈ మేరకు ప్రకటన రాలేదు. అయితే నిన్న మాత్రం పార్టీ మారుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. తన నియోజకవర్గ పరిధిలోని బండి ఆత్మకూరులో నిన్న జరిగిన ఓ విందుకు హాజరైన సందర్భంగా బుడ్డా ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని బుడ్డా పేర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ అందరి అభీష్టం మేరకే తాను టీడీపీలోకి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని కూడా బుడ్డా తెలిపారు. రేపే (ఈ నెల 28న) తాను టీడీపీలో చేరుతున్నానని కూడా ఆయన ప్రకటించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి 35 బస్సుల్లో తన అనుచరగణం రేపు విజయవాడకు తరలనుందని ఆయన చెప్పారు.