: దువ్వాడ సెజ్ అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు... రూ.200 కోట్ల మేర ఆస్తి నష్టం
విశాఖ జిల్లా దువ్వాడ సెజ్ లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెజ్ లోని బయో మ్యాక్స్ కంపెనీలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే కంపెనీని చుట్టుముట్టేశాయి. కంపెనీలోని 12 ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో రూ.200 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ రంగంలోకి దిగారు. గంటా, అమిత్ గార్గ్ లు ఘటనా స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక సహాయక చర్యలపై పోలీసు, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన చినరాజప్ప... ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అగ్ని కీలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భారీగా ఎగసిపడుతున్న మంటల కారణంగా అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.