: టీడీపీలోకి కాంగ్రెస్ సీనియర్!... ముహూర్తం కోసం వేచి చూస్తున్న గాదె!
ఏపీలో అధికార పార్టీ టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. గడచిన ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరగా, తాజాగా వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గాదె... గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి 2004, 2009లో వరుసగా విజయం సాధించారు. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్ లో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసిన గాదె... వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్లలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గాదె... టీడీపీ నేతల విజయం కోసం కృషి చేశారు. అయితే నాడే టీడీపీలో చేరేందుకు గాదె కొంతమేర యత్నించినా... ఆ తర్వాత ఏ కారణం చేతనో సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా క్రియాశీల రాజకీయాలకు కూడా కాస్తంత దూరం జరిగారు. తాజాగా పార్టీ మారి మళ్లీ క్రియాశీలకంగా మారేందుకే గాదె నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ ముఖ్యులతో జరిపిన మంతనాలు సత్ఫలితాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీలో గాదె ఎంట్రీకి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంచి ముహూర్తం కోసం గాదె వేచి చూస్తున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. ఒకటి, రెండు రోజుల్లో గాదె టీడీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి.