: 'సూది మహిళల' దాడిలో మహిళ మృతి


ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. ఒక మహిళపై ముగ్గురు మహిళలు సూది దాడికి పాల్పడిన సంఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... చీరాలకు చెందిన మాంసం వ్యాపారి ఇలియాస్ కి చీరాల, గుంటూరులలో చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా గుంటూరు వెళుతుండేవాడు. ఈ క్రమంలో గుంటూరులోని ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె మోజులో పడ్డ ఇలియాస్ తన భార్య హసీనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒక పన్నాగం పన్నాడు. గుంటూరుకు చెందిన ముగ్గురు మహిళలను చీరాలలోని తన ఇంటికి వెళ్లాలని చెప్పాడు. మతం గురించి చెప్పేందుకు వచ్చామని తన భార్యను నమ్మించి ఆమెపై సూదు దాడులు చేయాలని చెప్పాడు. దీంతో, ముగ్గురు మహిళలు బురఖాలు ధరించి ఈరోజు సాయంత్రంలో ఇలియాస్ ఇంటికి వెళ్లడం, మత ప్రబోధకులమని చెప్పడంతో అతని భార్య వారిని ఇంట్లోకి రానిచ్చింది. ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత, ముగ్గురు మహిళలు ఆమె మెడపై సిరంజితో గుచ్చారు. దీంతో, హసీనా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకోవడంతో ఆ మహిళలను పట్టుకుని చితకబాదారు. అనంతరం నిందిత మహిళలను పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ హసీనాను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా, దాడికి ఉపయోగించిన సిరంజిలో బంగారం శుద్ధి చేసేందుకు వినియోగించే రసాయనాన్ని నింపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, భార్య అడ్డు తొలగించుకోవడానికి ఇలియాస్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News