: టీ సర్కారుకు ఈసీ జలక్... ఖమ్మం కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు


పాలేరు ఉప ఎన్నిక ముందు తెలంగాణ సర్కారుకు ఊహించని అనుభవం ఎదురైంది. తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసిమ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కలెక్టర్ గణేశ్ లను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసింది. మంత్రి తుమ్మల పాలేరు ఉప ఎన్నికలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు ఈసీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల హయాంలోనే కలెక్టర్, ఎస్పీ నియామకాలు జరిగాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వారినే కొనసాగిస్తే పాలేరు ఉప ఎన్నిక నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. దీంతో ఖమ్మం కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో పోస్ట్ కు ముగ్గురు అధికారుల పేర్లను సూచిస్తూ తమకు జాబితా పంపాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా, ఈసీ నిర్ణయాన్ని అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ స్వాగతించాయి. అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఫలితాన్ని తారుమారు చేస్తామని ఎవరైనా భావిస్తే అది వారి అవివేకమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనన్నారు. అభివృద్ధి చేస్తున్నామని భావిస్తే ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు.

  • Loading...

More Telugu News