: మధుమేహం గుప్పిట భారత్


ప్రపంచంలో అత్యధిక జనాభాతో అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళుతున్న భారత్ కు రుచించని విషయమే ఇది. దేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 2015వ సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో 6.91 కోట్ల మధుమేహులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 2014లో ఈ సంఖ్య 6.68కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మధుమేహ బాధితులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందన్న లాన్సెట్ మెడికల్ జర్నల్ కథనాన్ని ఉదాహరిస్తూ... 1980 నుంచి 2014 మధ్య భారతీయ మహిళల్లో మధుమేహం ప్రాబల్యం 80 శాతం మేర పెరిగిపోయినట్టు మంత్రి నడ్డా పేర్కొన్నారు. మధుమేహం, కేన్సర్, కార్డియో వాస్క్యులర్ వ్యాధులు, స్ట్రోక్ లను ముందస్తుగా గుర్తించి నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద చర్యలను ఆచరణలో పెట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు, చికిత్సను సిఫారసు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం 10.96 కోట్ల మంది మధుమేహ రోగులతో చైనా ప్రపంచంలో టాప్ ప్లేస్ లో ఉండగా, 6.91 కోట్ల మంది బాధితులతో భారత్ రెండో స్థానం, 2.93కోట్ల మందితో అమెరికా మూడో స్థానాన్ని పంచుకున్నాయి.

  • Loading...

More Telugu News