: సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న నారాయణ కళాశాలపై దాడి
వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కర్నూల్ లోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన జూనియర్ కళాశాలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. క్లాసులు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలియడంతో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి కళాశాలలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. వేసవిలో తరగతులు నిర్వహించవద్దన్న అధికారుల ఆదేశాలను కళాశాల యాజమాన్యం బేఖాతర్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఆర్.వై.ఓ పరమేశ్వరరెడ్డి కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులను బయటకు పంపివేశారు. మరోసారి తరగతులు నిర్వహిస్తే ఊరుకోమని, కళాశాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సంఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.