: గతంలో కాంగ్రెస్ శ్రీకాంతాచారి తల్లిపై పోటీ చెయ్యలేదా?: టీఆర్ఎస్ ఎంపీ కవిత సూటిప్రశ్న
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలపై నిజామాబాద్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లీనరీ నిర్వహణ, ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కేసీఆర్ వ్యూహాల వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుండి 15ఏళ్లలో తమ పార్టీ ఎన్నో కష్టాలను ఎదుర్కొందని చెప్పారు. ప్లీనరీలో నాలుగు వేల మంది సభ్యులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లీనరీ ఏర్పాట్లలో తాము బిజీగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపులు, పాలేరు ఎన్నికల అంశంపై కవిత మాట్లాడుతూ.. నైతికత గురించి మాట్లాడే హక్కు టీడీపీ, కాంగ్రెస్‌లకు లేదని అన్నారు. సాంప్రదాయాలు, విలువలు అంటూ మాట్లాడుతోన్న కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను గురించి గుర్తు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. రాంరెడ్డి వెంకట రెడ్డి కుటుంబ సభ్యులపై తమ పార్టీకి సానుభూతి ఉందని ఆమె చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు శ్రీకాంతాచారి తల్లిపై పోటీ చెయ్యలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో స్పష్టమైన ప్రణాళికలతో ప్రజా సంక్షేమం దిశగా ముందుకు వెళుతున్నామని అన్నారు. కేసీఆర్ నిష్పక్షపాతంగా మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులు జరుపుతున్నారని ఈ సందర్భంగా కవిత తెలిపారు.