: టీఆర్ఎస్ లో నెంబర్:2 ప్లేస్ కేటీఆర్ దే!... కీలక శాఖలన్నీ ఆయన చేతిలోనే!
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోనే కాక తెలంగాణ కేబినెట్ లోనూ కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిది? మొన్నటిదాకా ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు పేర్లు వినిపించాయి. వాటిలో ఒకటి కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు కాగా, రెండోది కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై ఈ ప్రశ్నకు కేటీఆర్ అనే సమాధానం మాత్రమే వస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. కేసీఆర్ కేబినెట్ లో తొలుత ఐటీ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను కేటీఆర్ చేపట్టారు. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టిన కేటీఆర్ కు బహుమానంగా పురపాలక శాఖ బాధ్యతలు కూడా చేజిక్కాయి. ఇక ఆ తర్వాత జరిగిన వరంగల్ గ్రేటర్, ఖమ్మం కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఇక తన శాఖ కాకున్నా... రాష్ట్రానికి పరిశ్రమలను రాబట్టే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్, పరిశ్రమల శాఖలోనూ తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. తాజాగా శాఖల మార్పుల్లో కేటీఆర్ కు... ఆయన తండ్రి, సీఎం కేసీఆర్ మరింత ప్రాధాన్యమిచ్చారు. నిన్న జారీ అయిన నోటిఫికేషన్లో కేటీఆర్... మునిసిపల్, ఐటీ, పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, గనులు, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతల్లోకి మారిపోయారు. దీంతో భవిష్యత్తులో కేసీఆర్ తర్వాత కీలక బాధ్యతలు చేపట్టే నేతగా ఆయన పేరునే అటు పార్టీ వర్గాలే కాక ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు.