: వినాశకాలే విపరీత బుద్ధి: 'టీఆర్ఎస్' తీరుపై జానారెడ్డి
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి రాష్ట్ర పాలక పక్షం విపరీత ధోరణులకు పాల్పడుతోందని, 'వినాశకాలే విపరీత బుద్ధి' అని ఆయన వ్యాఖ్యానించారు. వారికి కాలమే సరైన గుణపాఠం చెబుతుందని అన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని ఉద్ఘాటించారు. కొత్త రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జరగడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం సమర్థవంతంగా పని చెయ్యాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసే విధంగా కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. పార్టీ మారిన వారిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.