: నా ఆస్తులు రూ.113.73 కోట్లు: జయలలిత వెల్లడి
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన ఆస్తులు రూ.113.73 కోట్లుగా ఆమె ప్రకటించారు. వీటిల్లో స్థిర, చర ఆస్తులు వరసగా రూ.41.63 కోట్లు, రూ.72.10కోట్లు ఉన్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం గతంలో ఉప ఎన్నిక నేపథ్యంలో జయలలిత ప్రకటించిన ఆస్తుల కన్నా ఈసారి ఆమె ఆస్తులు రూ.3.4 కోట్లు తగ్గాయి. ఏఐఏడీఎంకే పార్టీ అధ్యక్షురాలైన జయలలిత చెన్నైలోని రాధాకృష్ణ (ఆర్కే) నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. గత ఉప ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి సుమారు లక్షా యాభైవేల భారీ మెజార్టీతో గెలుపొందిన జయలలితకు ఈసారి పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ప్రత్యర్థి పార్టీలతో ఆమెకు గట్టి పోటీ నెలకొంది.