: టాలీవుడ్ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు


టాలీవుడ్ ప్రముఖులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటికి నిన్న వివాదాస్పద నటుడు ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్టు కింద కేసు నమోదైంది. తాజాగా ప్రముఖ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు నమోదైంది. కలప వ్యాపారి ఆర్వీ కృష్ణారావు ఫిర్యాదు మేరకు తేజతో పాటు వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... తేజ, హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్ నెం:9లో నివాసముంటున్న కృష్ణారావుల మధ్య ఓ ఇంటికి సంబంధించి వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న రాత్రి ఫిలింనగర్ ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం:12 వైపు వెళుతున్న కృష్ణారావును విక్కీ అనే వ్యక్తి ఆపాడు. ఇంటికి సంబంధించి తేజతో ఉన్న వివాదాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలని విక్కీ ఆయనకు సూచించాడు. లేని పక్షంలో వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లు చూస్తూ ఉరుకోవని హెచ్చరించాడు. ఆ తర్వాత ఈ నెల 13న తేజ ఇదే విషయంలో కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించారు. ఈ క్రమంలో తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని కృష్ణారావు నిన్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తేజ సహా వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News