: భయపెట్టిన విమానంలో... వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా గడిపారంటే...!


నిన్నటి ఢిల్లీ ప్రయాణాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు... తమ జీవితంలో మరిచిపోలేరేమో. ఎందుకంటే... ఏకంగా 44 మంది ఎమ్మెల్యేలు, మరికొంత మంది ఎమ్మెల్సీలు... అంటే మొత్తం పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఎక్కిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఉందని తేలిపోయింది. టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే విమాన సిబ్బంది నుంచి హెచ్చరికలు వినిపించాయి. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి శంషాబాదు ఎయిర్ పోర్టులోనే దించేస్తున్నామని ప్రకటించిన మహిళా పైలట్లు... విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన మరుక్షణంలోనే అందులో సాంకేతిక లోపం ఉందన్న ప్రకటనతో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ కనిపించిన రోజా సహా మిగిలిన వైసీపీ నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కుర్చీలకే అతుక్కుపోయారు. ఏ ఒక్కరి నోటా ఒక్క మాటా పెగల్లేదు. తమకు ఎలాంటి అపాయం కలగకుండా చూడాలని వారంతా దేవుడిని మనసులోనే ప్రార్థించారట. ఈలోగానే మహిళా పైలట్లు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని బతుకు జీవుడా అంటూ గబగబా విమానం దిగిపోయారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని అరగంటలో సరిచేస్తామని సిబ్బంది చెప్పినా... గంటా 45 నిమిషాల సమయం పట్టింది. దీంతో 8.45 గంటలకు బయలుదేరాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు... ఆ తర్వాత 11.30 గంటలకు తాము దిగిన విమానంలోనే ఢిల్లీ బయలుదేరారు. రెండో సారి టేకాఫ్ తీసుకున్న విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ కాగా, విమానం దిగిన వైసీపీ నేతలు ఎయిర్ పోర్టులోనే గ్రూపుగా లగేజీలు పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు.

  • Loading...

More Telugu News