: క్యాడ్ బరీ ప్లాంట్ లో చంద్రబాబు సందడి!... ఏపీ సీఎంతో సెల్ఫీలకు పోటీపడ్డ చాక్లెట్ కంపెనీ సిబ్బంది
ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ ప్లాంట్ ను... క్యాడ్ బరీ సంస్థ నిన్న చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీలో ప్రారంభించింది. కొత్తగా కట్టిన ఈ యూనిట్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ఏటా 60 వేల టన్నుల చాక్లెట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఈ యూనిట్ లో చంద్రబాబు కలియదిరిగారు. కంపెనీ ప్రతినిధులు వెంట రాగా యూనిట్ లోని అన్ని విభాగాలను చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి సిబ్బందితో పలు విషయాలను చర్చిస్తూ పలు సలహాలు, సూచనలు చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు ఉత్సాహంగా తమ యూనిట్ లో తిరగడాన్ని చూసిన కంపెనీ సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. సిబ్బంది ఉత్సుకతను కాదనలేక చంద్రబాబు కూడా వారికి సహకరిస్తూ వారి సెల్ ఫోన్ కెమెరాలకు పోజులిచ్చారు.