: జగన్ ‘డిల్లీ బృందం’లో 8 మంది ఎమ్మెల్యేలు గాయబ్!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. ఈ ‘ఆకర్ష్’కు ఎలా చెక్ పెట్టాలో తెలియక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ నాయకుల వద్దనైనా టీడీపీ ‘ఆకర్ష్’పై తమ ఆందోళన వెలిబుచ్చుదామంటూ ఆయన చేపట్టిన ఢిల్లీ యాత్ర సత్ఫలితాలిస్తుందో?... లేదో? తెలియదు కానీ, ఆరంభంలోనే ఆయనకు గట్టి షాకిచ్చింది. జగన్ పిలుపు మేరకు నిన్న ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏకంగా 8 మంది అసలు కనిపించనే లేదు. 44 మంది ఎమ్మెల్యేలు విమానం ఎక్కగా, మరో 8 మంది ఎమ్మెల్యేల అడ్రెస్ గల్లంతైంది. వీరిలో కిడారి సర్వేశ్వరరావు (అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్ నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), రామచంద్రారెడ్డి (పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు. వీరిలో అరమర్ నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో కనిపించలేదు. ఇక మొన్ననే ఢిల్లీ వెళ్లిన కారణంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా నిన్నటి బృందంలో కనిపించలేదు. తన తాత మరణంతో నిన్న ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి... తిరిగి రాత్రికల్లా ఢిల్లీ చేరుకున్నారు. ఇక కిడారి, గొట్టిపాటి, బుడ్డా, పోతుల... కనిపించని వైనంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మొదటి ముగ్గురు టీడీపీలోకి ‘జంప్’ చేసేందుకు దాదాపుగా కార్యరంగాన్ని సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే వీరు నిన్నటి ఢిల్లీ బృందంలో కనిపించలేదని అటు వైసీపీ వర్గాల్లోనే కాక ఇటు టీడీపీ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఇక పోతుల రామారావు కనిపించకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోతుల కూడా పార్టీ మారే క్రమంలోనే ఢిల్లీకి రాలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News