: వైఎస్ ఓకే!... జగన్ నాట్ ఓకే!: వైసీపీలో చేరి తప్పుచేశానన్న వేమిరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణా రంగారావు లాంటి నేతలు పార్టీ మారినా, జగన్ పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. తమకు జగన్ మంచి గుర్తింపే ఇచ్చారని, అయితే కొన్ని పరిస్థితుల కారణంగా తాము పార్టీ మారాల్సి వచ్చిందని సుజయ తెలిపారు. తాజాగా నిన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జిల్లా సమన్వయకర్తగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు నిన్న నెల్లూరులో మీడియా సమావేశం పెట్టి మరీ వేమిరెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ వైఖరిపై వేమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీలో చేరి తాను తప్పు చేశానని వేమిరెడ్డి అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి... ఆయన కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదన్నారు. ‘వైఎస్ ఓకే... జగన్ నాట్ ఓకే’’ అంటూ పేర్కొన్న వేమిరెడ్డి... జగన్ వైఖరి కారణంగానే ఆ పార్టీలో తాను ఎందుకు చేరానా? అని బాధపడుతున్నానని కూడా వ్యాఖ్యానించారు.