: వచ్చే మూడ్రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణ ప్రజలు రానున్న మూడ్రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వచ్చే మూడ్రోజులలో తీవ్రమైన వడగాలులు వీయనున్నాయని పేర్కొంది. తెలంగాణలోని పది జిల్లాల్లో వేడి గాలులు తప్పవని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఈరోజు హైదరాబాద్ లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండలకు భయపడి బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో మధ్యాహ్న సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, కర్నూల్ తో పాటు కృష్ణా జిల్లా నందిగామలో ఈరోజు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.