: రోడ్లపై అడుక్కోవడం కంటే బార్లలో డ్యాన్స్ లు చేయడమే నయం కదా?:‘సుప్రీం’ ధర్మాసనం


రోడ్లపై అడుక్కోవడం కంటే బార్లలో డ్యాన్స్ చేసుకోవడమే నయమంటూ మహారాష్ట్ర సర్కార్ పై సుప్రీంకోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. డ్యాన్స్ బార్లకు లైసెన్స్ లు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడం సబబుకాదంటూ మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దంటూ హెచ్చరించింది. అంతేకాకుండా, విద్యా సంస్థలకు ఒక కిలోమీటరు దూరంలో డ్యాన్స్ బార్లు తెరవడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర సర్కార్ నిబంధనలను అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. మహిళలు రోడ్లపై ముష్టెత్తుకోవడం లేదా ఆమోదయోగ్యం కాని పనులు చేయడం కన్నా బార్లలో డ్యాన్స్ చేయడమే నయమంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. డ్యాన్స్ అనేది ఒక వృత్తి అని, ఒకవేళ డ్యాన్స్ అసభ్యంగా ఉంటే కనుక అది చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని, ప్రభుత్వం నియంత్రణా చర్యలు తీసుకోవచ్చు గానీ, నిషేధించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ఈ నెల 12వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ డ్యాన్స్ బార్ రెగ్యులేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో పొందుపరిచిన నిబంధనలపై బార్ నిర్వాహకులు, యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ‘సుప్రీం’ ధర్మాసనం ఈమేరకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News