: సినిమాల్లో చేరాలనుకునే వారి కోసం.. జగపతిబాబు ప్రారంభించిన పోర్టల్ ‘క్లిక్ సినీకార్ట్’!
సినీ రంగంలోని పలు విభాగాల్లో ప్రవేశించాలనుకునే ప్రతిభావంతులకు 'క్లిక్ సినీకార్ట్' పోర్టల్ వేదిక కానుంది. ప్రముఖ చలన చిత్ర నటుడు జగపతిబాబు సొంత పోర్టల్ అయిన దీనిని ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, టీడీపీ నేత, సినీ నటుడు మురళీమోహన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ, జగపతిబాబు ఈ పోర్టల్ ను ప్రారంభించడం ఎంతో సంతోషమంటూ ఆయనను అభినందించారు. చిత్ర రంగంలో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు, పరిశ్రమకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ, ఈ పోర్టల్ ద్వారా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించే అవకాశం నిర్మాతలకు కలుగుతుందని అన్నారు.