: ఏడాది కాలానికి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నరేశ్ కుమార్ రెడ్డి!
ఏపీ శాసనమండలి సభ్యుడిగా నరేశ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రమాణం చేశారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2011లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేశాయి తిప్పారెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్ కుమార్ రెడ్డి ‘సింగిల్’ ఓటు తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే నాడు తిప్పారెడ్డికి వచ్చినన్ని ఓట్లు తనకూ వచ్చాయని, అయితే తనకంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిందని చెప్పిన అధికారులు తిప్పారెడ్డిని విజేతగా ప్రకటించారని నరేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ క్రమంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తిప్పారెడ్డి రాజీనామాను ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో ఇటీవలే ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం... తిప్పారెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ సమాన సంఖ్యలో ఓట్లు వచ్చాయని తేల్చేసిన కోర్టు... లాటరీ తీసి నరేశ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపికైనట్లు ప్రకటించిన విషయమూ విదితమే. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని శాసనమండలి ప్రాంగణంలో నరేశ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేశారు. ఆ ఎన్నిక జరిగి ఇప్పటికే ఐదేళ్లు పూర్తి కాగా, ఇక మిగిలిన ఏడాది కాలం వరకు మాత్రమే నరేశ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతారు.